శివాజీ విగ్రహం నిర్మాణ సలహాదారు అరెస్ట్

Shivaji statue construction consultant arrested

న్యూఢిల్లీ: గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తయిన శివాజీ విగ్రహం ఈ నెల 26న కుప్పకూలింది. ఈ కేసులో నిర్మాణ సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే విగ్రహం శిల్పిపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా, విగ్రహం కూలిపోవడంపై రాజకీయ దుమారం చెలరేగుతున్నది. ఘటనపై విపక్ష మహావికాస్ అఘాడీ తప్పుపడుతూ సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నది.

సెప్టెంబర్ 1న నిరసన ర్యాలీ చేపడతామని ప్రకటించింది. ఈ ఘటనపై ఇప్పటికే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీ మనందరి ఆరాధ్య దైవం అని, ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. గతేడాది నేవీ డే సందర్భంగా మాల్వాన్లోని రాజ్కోట కోటలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆ విగ్రహం కూలిన ఘటన ఆయన్ను అభిమానించేవారిని చాలా బాధించిందన్నారు.