రాజ్‌కోట్ ఫోర్ట్ లో కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ ఫోర్ట్ లోని ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల ఎత్తైన భారీ విగ్రహం కుప్పకూలిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ విగ్రహం కుప్పకూలింది. గత ఏడాది డిసెంబర్ 4న నేవీడే సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోడానికి సరైన కారణం తెలియకపోయినా, గత రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు , ఈదురు గాలులే కారణం కావచ్చని భావిస్తున్నారు. మరోవైపు, ఈ విగ్రహ నిర్మాణంలో లోపాలున్నాయని, పనుల్లో నాణ్యత లేనందునే విగ్రహం కుప్పకూలిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ నేత జయంత్ పాటిల్.. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. విగ్రహానికి సరైన నిర్వహణ చేయలేదని.. దాని పట్ల కొంచెం కూడా శ్రద్ధ వహించలేదని మండిపడ్డారు. కేవలం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించాలనే తాపత్రయంలో షిండే సర్కార్ మునిగిపోయిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త టెండర్లు ఇచ్చి.. కమీషన్లు తీసుకుని కాంట్రాక్టులు ఇస్తోందని విమర్శించారు.