యూకే అనుమతించే వరకు భారత్‌లోనే హేక్‌ హసీనా..?

Sheikh Hasina To Stay In India Until UK Grants Asylum: Report

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా పదవి నుంచి వైదొలిగి దేశం వీడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌కు రాగా.. మరి కొంత కాలం ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హసీనాకు భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

షేక్‌ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరినట్లు సమాచారం. దీనిపై బ్రిటన్‌ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేవరకు ఆమె భారత్‌ లో ఉండేందుకు ఢిల్లీ తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ సమయంలో హసీనాకు భారత్‌ సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బంగ్లాదేశ్‌ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్‌ ప్రభుత్వం స్పందించింది. గత రెండు వారాలుగా అల్లర్ల కారణంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టంపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరింది. ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందులో షేక్‌ హసీనాకు ఆశ్రయమిచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.

హసీనా సోదరి రెహానా యూకే పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్‌ సిద్దిఖీ ప్రస్తుతం లేబర్‌ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం యూకేలో లేబర్‌ పార్టీనే అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్‌ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది.