భారీ వర్షాలపై ప్రజలకు మెసేజ్లు పంపండి – సీఎం చంద్రబాబు

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో CM చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని సూచించారు. వర్షాలపై ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలని, మ్యాన్ హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. వాగులు, వంకల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.

సీఎం ఆదేశాలతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. తాజాగా గుంటూరు, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. కాకినాడ జిల్లాలో విద్యార్థులకు నేడు నిర్వహించాల్సిన పరీక్షను సెలవు కారణంగా సెప్టెంబర్ 6న జరుపుతామని కలెక్టర్ తెలిపారు.