లష్కర్ బోనాల జాతర ప్రారంభం..

సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి(లష్కర్) బోనాల జాతర ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు తొలిబోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చేవారికి హైదరాబాద్‌ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి అమ్మవారి దర్శనం కలిగేలా చూడాలని తెలిపారు. ప్రజల సహకారంతో బోనాలు విజయవంతం అవుతాయని చెప్పారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందన్నారు. అమ్మవారి బోనాన్ని అలంకరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను ప్రారంభించినట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించానని వెల్లడించారు.