భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల తర్వాత, ఆమె వ్యక్తిగత జీవితం గురించి పలు రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆమె తన కుమారుడు ఇజాన్‌తో కలిసి దుబాయ్‌లో జీవిస్తున్నారు. మరోవైపు భారత క్రికెటర్ మహమ్మద్ షమీ తన భార్య హసీన్ జహాన్‌తో విభేదాల కారణంగా విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సానియా, షమీ వివాహం చేసుకుంటున్నట్లు ఓ వార్త ప్రచారం అవుతోంది.
తాజాగా సానియా మీర్జా, మహమ్మద్ షమీ వివాహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో వీరిద్దరూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులుగా ఉన్నట్లుగా కనిపిస్తుండటంతో, వార్తలు మరింత జోరందుకున్నాయి. వీటి ద్వారా నిజంగానే వీరు పెళ్లి చేసుకున్నారనే అభిప్రాయాలు కలిగాయి. ఈ పెళ్లి ఫొటోలు ఎలాంటి నిజం కాకుండా, పూర్తిగా కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో రూపొందించినవిగా తేలింది. ఆకతాయిలు ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి సానియా, షమీలను పెళ్లి చేసేశారు. నకిలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వీటి వెనుక ఉన్న నిజం వెలుగులోకి వచ్చింది. కొందరు వీటిని జస్ట్ ఫన్‌గా తీసుకుంటుండగా, మరికొందరు వ్యక్తిగత జీవితాలపై ఈ రకమైన ప్రచారం అనవసరమని, సెలబ్రిటీల ప్రైవసీకి ముప్పుగా మారుతుందని అంటున్నారు.