బతుకమ్మ పండుగ చివరి అంకానికి చేరింది. చివరిదైన తొమ్మిదో రోజును సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఈరోజు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు. గౌరమ్మకు నువ్వులు, పెసర్లు, వేరుశెనగలు, బియ్యంతో చేసిన సత్తుపిండి, పెరుగన్నం, పులిహోరని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. మహిళలంతా ఆడిపాడిన తర్వాత బతుకమ్మను కాలువల్లో, కుంటల్లో, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.
సద్దుల బతుకమ్మ అన్నింటి కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఎనిమిది రోజులతో పోలిస్తే తొమ్మిదో రోజు పేర్చే బతుకమ్మ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇదే రోజు దుర్గాష్టమి పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది అష్టమి, నవమి ఒకే రోజు వచ్చాయి. సద్దుల బతుకమ్మ రోజు ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలు అమర్చుకుంటూ ఎత్తైన బతుకమ్మ తయారు చేస్తారు. అలాగే పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మ కూడా పెట్టుకుంటారు. పసుపుతో గౌరీ దేవిని చేసి పూజిస్తారు. అమ్మవారిని పూజించిన తర్వాత పసుపు తీసుకుని మహిళలు ఒకరికొకరు రాసుకుంటారు.
తొమ్మిదో రోజు సాగే సద్దుల బతుకమ్మ చూసేందుకు ఊరు వాడ అంతా ఒక చోటుకు చేరతారు. మహిళలు అందరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ప్రకృతిలో దొరికే పూలు అన్నింటినీ తెచ్చుకుంటారు. తాంబూలం పళ్ళెం తీసుకుని అందులో అన్ని రంగుల పూలను వరుసలుగా పేర్చుకుంటూ ఉంటారు. కొందరు వలయాకారంలో పెడితే మరికొందరు గోపురం, స్తూపం ఆకారంలో అమర్చుకుంటారు. గునుగు పూలకు రంగులు అద్ది వాటిని ఉపయోగిస్తారు.