సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) వెహికల్ అలవెన్స్ (Vehicle allowance) కోసం జయశంకర్ వర్సిటీ (Jayashankar University) నుంచి భారీగా నిధులు తీసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 2016 నుంచి 2024 వరకు తన వాహన ఖర్చుల కోసం నెలకు రూ. 63,000 చొప్పున మొత్తం రూ. 61 లక్షలు అద్దె కింద తీసుకున్నట్లు ఇటీవల ఆడిట్ నివేదికలో తేలింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియడంతో, వర్సిటీ నిర్వాహకులు ఆమెకు నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నారు.
వ్యక్తిగత అలవెన్స్ తీసుకోవడం సరైనదేనా?
వర్సిటీ నిధుల నుండి వ్యక్తిగత అలవెన్స్ తీసుకోవడం సరైనదేనా? అనే ప్రశ్నపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా స్మితా సబర్వాల్‌కు ఇప్పటికే వాహన సదుపాయాలు ఉంటాయని, పైగా ఈ తరహా చెల్లింపులు నిబంధనలకు విరుద్ధమని ఆడిట్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. సీఎంవో అడిషనల్ సెక్రటరీ హోదాలో ఆమె ఈ నిధులను పొందారని వెల్లడైంది.

ప్రభుత్వ నిధుల వినియోగంపై మరోసారి పెద్ద చర్చ
ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. స్మితా సబర్వాల్ నుండి ఈ మొత్తం తిరిగి రాబట్టే చర్యలు చేపట్టాలని వర్సిటీ బోర్డు సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల వినియోగంపై మరోసారి పెద్ద చర్చ మొదలైనప్పటికీ, స్మితా సబర్వాల్ ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు.