పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ టోర్నీ, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా ఏప్రిల్‌కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ప్రారంభమవ్వడంతో, పీఎస్ఎల్‌కు ఐపీఎల్‌తో నేరుగా పోటీ ఎదురుకానుంది. అయితే, ఈ టోర్నీ కంటే ముల్తాన్ సుల్తాన్స్ చేసిన ఓ పని ఇప్పుడు భారత అభిమానుల ఆగ్రహానికి దారి తీసింది.
రోహిత్ శర్మ వాయిస్ ఓవర్ – మస్కట్ వివాదం
పీఎస్ఎల్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ ఓ ప్రోమో వీడియోను విడుదల చేసింది. ఇందులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను తీసుకుని, తమ మస్కట్ (కోమలమైన, లావుగా కనిపించే కార్టూన్ క్యారెక్టర్) కు వాయిస్ ఓవర్ గా ఉపయోగించింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు భగ్గుమన్నారు. వీడియోలో రోహిత్ శర్మ వాయిస్‌ను ఉపయోగించి బాడీ షేమింగ్ చేయడం అవమానకరం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత అభిమానుల ఘాటైన రియాక్షన్
ఈ వీడియోపై భారత అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఇది చాలా అసభ్యకరమైన చర్య. వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన కెప్టెన్‌పై బాడీ షేమింగ్ చేయడమేంటి? ముందు ఆటలో మెరుగుదల సాధించండి అని ఓ అభిమాని మండిపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మీ దేశానికి కనీసం ఒక్క ఐసీసీ ట్రోఫీ అయినా గెలవండి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే టైటిళ్లు రాకపోవటమే కాదు, మరింత అవమానం చవిచూడాల్సి వస్తుంది. ఈ వీడియోలో రోహిత్ శర్మ వాయిస్‌ను వెంటనే తొలగించాలి. ఇంతకుముందు బ్రాడ్ హాగ్ వ్యాఖ్యల విషయంలో రచ్చ చేసిన పాకిస్థాన్ క్రికెట్ ప్రముఖులు ఇప్పుడు ఏం చెబుతారు? అని మరొక అభిమాని ప్రశ్నించాడు. గతంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడిన కొన్ని మాటలను ముల్తాన్ సుల్తాన్స్ తమ వీడియో కోసం వాడుకుంది. అయితే, ఆ మాటలను తమ మస్కట్ క్యారెక్టర్‌కు జత చేసి, వ్యంగ్యంగా ప్రదర్శించడం వివాదాస్పదమైంది. ఈ వివాదాస్పద వీడియోపై ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంచైజీ స్పందించి, రోహిత్ శర్మ వాయిస్‌ను తొలగించాలనే డిమాండ్ పెరుగుతోంది. అంతేకాక, భారత క్రికెట్ బోర్డు (BCCI) దీనిపై అధికారికంగా స్పందించాలని కొందరు అభ్యర్థిస్తున్నారు. రోహిత్ శర్మను అవమానించడానికి ఇది ఓ వ్యూహమా? భారత క్రికెట్ బోర్డు దీనిపై ఏమైనా చర్య తీసుకుంటుందా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.