రాబర్ట్ వాద్రా రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ భర్త అయిన ప్రముఖ వ్యాపారవేత్త Robert వాద్రా రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తిని వెల్లడించారు. ఆయన తన రాజకీయ ప్రవేశం గురించి స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే తప్పకుండా తన కుటుంబ సభ్యుల ఆశీస్సులతో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.
కుటుంబ అనుబంధం వల్లే రాజకీయాల పట్ల ఆకర్షణ
Robert వాద్రా మాట్లాడుతూ, తనకు గాంధీ కుటుంబంతో గల సంబంధం వల్లే రాజకీయాలపై బలమైన అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఆయనను రాజకీయాల్లోకి రప్పించేందుకు ప్రయత్నించాయని, కానీ ఆయన ఇప్పటివరకు దూరంగా ఉన్నారని వెల్లడించారు.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజలకు సేవ చేసే అవకాశం రావాలన్న ఆకాంక్ష తనలో ఉందని అన్నారు. “నా భార్య ప్రియాంక, బావమరిది రాహుల్ గాంధీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వారు ప్రజల కోసం నిజంగా కష్టపడతున్నారు. ఇప్పుడు దేశానికి మరిన్ని గళాలు అవసరం. నేను కూడా ఒక గొంతుగా మారాలని భావిస్తున్నాను,” అని వాద్రా చెప్పారు.
మెహుల్ ఛోక్సీ అరెస్టుపై స్పందన
ఈ సందర్భంగా వ్యాపారవేత్త మెహుల్ ఛోక్సీ అరెస్టుపై కూడా Robert వాద్రా స్పందించారు. ఛోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేయడం దేశానికి గొప్ప విషయం అయినా, అతను దోచుకున్న రూ.13,850 కోట్లను తిరిగి రికవర్ చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అతనితో పాటు నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరస్థులను భారత్‌కు తిరిగి రప్పించి నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాజకీయ ప్రవేశం ద్వారా ప్రజలకి సేవ చేయాలనే లక్ష్యం
వాద్రా తన రాజకీయ ప్రవేశం ద్వారా దేశాన్ని లౌకికంగా ఉంచే విధంగా విభజన శక్తులతో పోరాడతానని స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, గ్రామీణ స్థాయిలో ఏం జరుగుతోంది, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో తనకు బాగా అవగాహన ఉందన్నారు. ఈ అనుభవాన్ని ఉపయోగించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే నాయకుడిగా ఎదగాలని ఆయన భావిస్తున్నారు.