టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్ధిక సాయంగా అందించనున్నట్లు ప్రకటించాడు. ‘రిషభ్ పంత్ ఫౌండేషన్’ (ఆర్‌పీఎఫ్) ద్వారా ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు పంత్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక వీడియోను పోస్టు చేశాడు. కఠిన సమాయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో తనకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నట్లు తెలిపాడు. ఇక క్రికెట్ తనకు అన్నీ ఇచ్చిందని, తన వాణిజ్య సంపాదనలో 10 శాతం ఆర్‌పీఎఫ్‌కి విరాళంగా ఇస్తానని చెప్పాడు.ఈరోజు నా దగ్గర ఉన్నదంతా అందమైన క్రికెట్ క్రీడ వల్లే. ఒక్కోసారి మన లైఫ్‌లో అనుకోకుండా చోటుచేసుకునే ఘటనలు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం నేను అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నా. అందుకే ఇంకా ఎక్కువ కృతజ్ఞతతో ఉండాలని నిర్ణయించుకున్నా. జీవితంలో నేను నేర్చుకున్నది ఎప్పుడూ వదులుకోకుండా, ఎల్లప్పుడూ ఆశతో నవ్వుతూ ఉండటం. నా ఆట ద్వారా నేను పొందిన దానిలో కొంత భాగం ప్రజలకు ఇచ్చి వారిలోనూ చిరునవ్వులను తీసుకురావడం అన్నది ఇప్పుడు నా లక్ష్యం.

తిరిగి ఇవ్వడం ద్వారా వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. నా వాణిజ్య ఆదాయంలో 10 శాతం రిషబ్ పంత్ ఫౌండేషన్ కోసం అంకితం చేస్తున్నా. ఆర్‌పీఎఫ్ నాకు చాలా ప్రియమైన ప్రాజెక్ట్. దాని లక్ష్యాలు నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. వచ్చే రెండు నెలల్లో దీని పూర్తి వివరాలు వెల్లడిస్తా. మీ ప్రేమ, ఆశీస్సులు, మద్దతుకు ధన్యవాదాలు” అని పంత్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు.ఇక పంత్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గొప్పవాళ్లు ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రిషభ్ పంత్ సుమారు 10 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అటు ఐపీఎల్‌లోనూ ఈసారి టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర (రూ.27కోట్లు) దక్కించుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.