భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లను వదలబోనంటూ వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర ఏదీ మర్చిపోదని తప్పక ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. చరిత్రను చెరిపేయడం ఎవరి వల్లా కాదన్నారు. బంగ్లాదేశ్, అక్కడి ప్రజల కోసం తానేమీ చేయలేదా? అని క్వశ్చన్ చేశారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అసలు షేక్ హసీనా ఎందుకింత సీరియస్ అయ్యారు? బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది? మాజీ ప్రధాని ఒక్కసారిగా గరంగరం అవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

అన్నిబ్యాన్ చేయాలి !
షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమెను బంగ్లాకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ఈ తరుణంలోనే ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఇంటికి నిప్పంటించడం చర్చనీయాంశంగా మారింది. షేక్ హసీనా అధ్యక్షురాలిగా ఉన్న ఆవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించాలంటూ కొందరు విద్యార్థులు ఢాకాలోని ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఇంటిపై దాడికి దిగారు. అద్దాలను పగులుగొట్టి ఇంట్లోకి వెళ్లిన ఆందోళనకారులు.. అక్కడి మొత్తం సామాగ్రిని ధ్వంసం చేశారు. అంతేగాక ఆ ఇంటికి నిప్పంటించారు.
చరిత్ర ఏదీ మరిచిపోదు !
షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఇంటికి నిప్పంటించిన ఘటనపై షేక్ హసీనా సీరియస్ అయ్యారు. చరిత్ర ఏదీ మరిచిపోదన్నారు. ఇంటిని ధ్వంసం చేయగలరేమో గానీ చరిత్రను మాత్రం చెరపలేరన్నారు. కాగా, షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రెహ్మాన్ పాకిస్థాన్ నుంచి బంగ్లాను విముక్తి చేయడంలో, స్వాతంత్య్ర పోరాటంలో విశేషంగా కృషి చేశారు. అయితే 1971లో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడగా. ఆ తర్వాతి ఏడాది ఢాకాలోని నివాసంలో ఆయనను హత్య చేశారు. దీంతో ఆ ఇంటిని మ్యూజియంగా మార్చారు షేక్ హసీనా. ఇప్పుడు అదే ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు.