రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేసిన సీఎం రేవంత్

తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో సోమవారం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇది రాజకీయ వేదిక కాదు..ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడం తనకు ఇష్టం లేదన్నారు. కానీ కొంతమంది చిల్లరమల్లరగా మాట్లాడేవారికి ఈ వేదికగా తాను కొన్ని విషయాలు గుర్తు చేయదలచుకున్నానన్నారు. అడ్డగోలుగా వేల కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు త్యాగం అంటే ఏమిటో గుర్తు చేయదలచుకున్నానన్నారు.

ఆనాటి సాయుధ పోరాటంతో గడీలలో గడ్డి మొలిసి ప్రజాస్వామ్య పాలన మొదలైందని, ఈరోజు నేను చెబుతున్నా బిడ్డా.. కాంగ్రెస్ పార్టీ మీద నోరు జారితే మీ ఫామ్ హౌస్ లో జిల్లెలు మొలిపిస్తానని హెచ్చరించారు. మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని ప్రకటించగాని ఇదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్నామని కేటీఆర్ గుండెలు బాధుకుంటున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు పదేళ్లు పడుతుందా? అధికారంలో ఉండగా ఏ గాడిద పళ్లుతోమావా అని ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ తన సొంత విగ్రహం ఇక్కడ పెట్టాలనుకుని ఈ స్థలాన్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నాడని ఆరోపించారు. ఏపీలో పార్టీ సర్వం కోల్పోయినా ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ తెలంగాణను ఇస్తే వారి కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి రాజీవ్ గాంధీ విగ్రహం కూలుస్తామంటున్నారు. ఎవడ్రా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది? ఒక్కడు రండి.. తారీఖు చెప్పండి ఎవరు వస్తారో నేను చూస్తానని చాలెంజ్ చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం సచివాలం నెలకొల్పుతామన్నారు. ప్రపంచం అంతా అబ్బురపడేలా ప్రారంభోత్సవం జరుపుతామన్నారు.