రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారులఫై మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో రేవంత్ రెడ్డి సమావేశం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీ లో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు , అభివృద్ధి వంటి వాటిపై కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ వస్తున్నారు. బుధువారం జాతీయ ర‌హాదారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సమావేశమయ్యారు. తెలంగాణలో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, నూత‌న జాతీయ ర‌హ‌దారుల ప్ర‌క‌ట‌న‌, ఇప్ప‌టికే జాతీయ ర‌హ‌దారులుగా ప్ర‌క‌టించిన మార్గాల ప‌నులపై కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు.

హైద‌రాబాద్-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని 6 వ‌రుస‌లుగా విస్త‌రించాల‌ని, ప్రాంతీయ రింగు రోడ్డు (RRR) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని కోరడం జరిగింది. సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌- తూప్రాన్‌- గ‌జ్వేల్‌- జ‌గ‌దేవ్‌పూర్‌- భువ‌న‌గిరి- చౌటుప్ప‌ల్ మార్గంలోని 158.645 కిలోమీటర్ల రోడ్లను జాతీయ ర‌హ‌దారిగా , చౌటుప్ప‌ల్ నుంచి అమ‌న్‌గ‌ల్‌- షాద్‌న‌గ‌ర్‌- సంగారెడ్డి వ‌ర‌కు ఉన్న 181.87 కిలోమీటర్ల ర‌హ‌దారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని మంత్రిని కోరడం జరిగింది.

హైద‌రాబాద్ ఓఆర్ఆర్ (Hyderabad ORR) గౌరెల్లి జంక్ష‌న్ నుంచి వ‌లిగొండ‌- తొర్రూర్- నెల్లికుదురు- మ‌హ‌బూబాబాద్‌- ఇల్లెందు- కొత్త‌గూడెం వ‌ర‌కు ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించార‌న్నారు. ప్యాకేజీ కింద 69 కి.మీ.ల‌కు టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించార‌ని గ‌డ్క‌రీ దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు.