తెలంగాణలో రియల్ ఎస్టేట్ సంక్షోభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ప్రభుత్వ పాలన రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద అడ్డంకిగా మారిందని హరీష్ రావు విమర్శించారు. గత ఏడాదిన్నర కాలంగా రియల్ ఎస్టేట్ రంగం క్షీణిస్తోందని వివిధ సర్వే సంస్థలు హెచ్చరించినా, అధికార పార్టీ పట్టించుకోలేదని ఆయన అన్నారు. కొంపల్లి రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి, ఆదిభట్ల నరసింహ గౌడ్ మరణాల ఘటనలను ప్రస్తావించిన హరీష్ రావు, సంక్షోభం వేగంగా వ్యాపిస్తున్నదని, వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు.
హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ నిలిపివేత, ఫార్మా సిటీ రద్దు, మెట్రో మార్గ మార్పులు వంటి ప్రభుత్వ నిర్ణయాలు రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన విమర్శించారు. ఇలాంటి విధానపరమైన తప్పిదాలతో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారని, రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ముప్పు ఉందని హెచ్చరించారు. నరసింహ గౌడ్ కుటుంబానికి వెంటనే ఆర్థిక సహాయం అందించాలని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సమస్య మరింత పెరగకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు.