Telangana : ఒకే ఆర్డర్ తో 6,729 మంది పైన రేవంత్ సర్కార్ వేటు వేసింది. ప్రభుత్వంలో పలు శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న పదవీ విరమణ చేసి, కాంట్రాక్టుపై పని చేస్తున్న వారిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో అటెండర్ నుంచి ఐఏఎస్‌ల దాకా ఉన్నారు. ఈ జాబితాలో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తో పాటుగా మరికొందరు ముఖ్య అధికారులు ఉన్నారు. వీరి స్థానంలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది.

ఏకంగా 6,729 మందిని ఒక జీవోతో ఇంటికి
ముఖ్యమంత్రి రేవంత్ పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుదీర్ఘ కాలంగా రిటైర్ అయినా కీలక హోదాల్లో కొనసాగుతున్న వారి పైన వేటు వేసారు. ఏకంగా 6,729 మందిని ఒక జీవోతో ఇంటికి పంపారు. ఇందులో అనేక హోదాల్లో కొనసాగుతున్న వారు ఉన్నారు. జాబితా లో మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎ్‌స రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వైటీడీఏ) వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్‌ఎన్ రెడ్డి.. పది మంది ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ శాఖలో కొనసాగుతున్న 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వు ల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ వాటర్‌వర్క్స్, మెట్రో రైల్, రెరా, మెప్మా, కుడా, వైటీడీఏ.. ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్ లు, ఆర్డీవోలు, డీఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్ల తో పాటుగా పలు క్యాడర్ల కు చెందిన అధికారులున్నారు. విద్యుత్తు శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించేందుకు కసరత్తు జరుగుతోంది.