కడపకు ఉప ఎన్నిక వస్తే గల్లీ గల్లీ తిరుగుతా – సీఎం రేవంత్ రెడ్డి

కడప పార్లమెంటుకు ఉప ఎన్నిక వస్తుందని పేపర్లలో వస్తుందని.. నిజంగా కడప పార్లమెంటుకు ఉప ఎన్నిక వస్తే గల్లీ గల్లీ ఊరూరు తిరిగి షర్మిలను గెలిపించి తీరుతా అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దివంగత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల గురించి చర్చ జరిగినప్పుడు కచ్చితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన వస్తుందని , కొందరు రాజకీయ నాయకుల తరహాలో వైఎస్ఆర్ పేరును ఎవరూ మర్చిపోలేరని.. ఆయన దూరమై 15 ఏళ్లు అయినప్పటికీ వైఎస్ జ్జాపకాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ రావాల్సి ఉన్నా ప్రస్తుతం ఆయన మణిపూర్ పర్యటన కారణంగా హాజరు కాలేకపోయారని అన్నారు.

అప్పుడు వైఎస్ఆర్ దృష్టిలో పడాలని మండలిలో బలమైన వాదనలు వినిపించే వాడిని. పిల్లవాడు అని కాకుండా వైఎస్ఆర్ ప్రతి అంశానికి సమాధానం చెప్పేవారు. కొత్తగా సభలో వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నారు అనేవారు. వాళ్లకు మనం అవకాశం ఇవ్వాలని అనేవారు. కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చొనేవారు. ఇదే నాయకుడు లక్ష్యం.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ తీరు మనకు ఆదర్శం. ఎవరు వినతి పత్రం ఇచ్చినా…అందరికీ సమయం ఇచ్చే వాడు. ప్రజా దర్బార్ లో అన్ని విజ్ఞప్తులు స్వీకరించేవారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 14 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆనాడు ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. రాహుల్ జోడో యాత్రతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. మూడోసారి మోడీ గెలిచినా అది గెలుపు కాదు.

రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. మొత్తం పాలకపక్షమే. ఉన్న ముగ్గురూ పాలకపక్షమే. మరి ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన కొట్లాడేందుకు వైఎస్ షర్మిల మాత్రమే ఉన్నారు. 2029లో వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతారు. అదే ఏడాదిలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు. ఇదే వైఎస్ చివరి కోరిక అన్నారు రేవంత్.