దేశ ప్రజలకు ఇప్పుడు కొంత ఊరట లభించింది రోజురోజుకు పెరిగిపోతున్న ధరల బెడద నుంచి కాస్త ఉపశమనం లభించింది. రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.34 శాతానికి చేరుకుంది.ఇది గడచిన ఆరేళ్లలో నమోదైన కనిష్ఠ స్థాయి. గత నెల ఫిబ్రవరిలో ఇది 3.61 శాతంగా ఉండగా, గత ఏడాది మార్చిలో మాత్రం 4.85 శాతంగా ఉంది. 2019 ఆగస్టులో నమోదైన 3.28 శాతం తర్వాత ఇదే తక్కువ స్థాయి కావడం గమనార్హం.ఆహార ధరల ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ఫిబ్రవరిలో ఇది 3.75 శాతంగా ఉండగా, మార్చిలో 2.69 శాతానికి తగ్గింది. ఇది గత ఏడాది ఇదే నెలలో 8.52 శాతంగా ఉండటం విశేషం. దీనికితోడు కూరగాయలు, పప్పులు, బంగాళాదుంపలు వంటి ప్రధాన ఆహార వస్తువుల ధరలు గణనీయంగా పడిపోవడం ఇందుకు కారణం.కేవలం రిటైల్ స్థాయిలోనే కాదు, టోకు ద్రవ్యోల్బణం కూడా తగ్గుదల నమోదు చేసింది.

టోకు ధరల సూచీ (WPI) ఆధారంగా మార్చి నెలలో ద్రవ్యోల్బణం 2.05 శాతానికి చేరుకుంది.ఇది ఫిబ్రవరిలో 2.38 శాతంగా ఉండగా, గత ఏడాది మార్చిలో కేవలం 0.26 శాతంగా మాత్రమే ఉంది. వీటన్నింటికి తోడు, ద్రవ్యోల్బణం తగ్గుతుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రుణాలపై వడ్డీభారం కూడా తగ్గే అవకాశముంది.రాబోయే 2025–26 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.
మొదటి త్రైమాసికంలో 3.6%, రెండో త్రైమాసికంలో 3.9%, మూడో త్రైమాసికంలో 3.8%, చివరి త్రైమాసికంలో 4.4%గా ఉండొచ్చని తెలిపింది.ద్రవ్యోల్బణానికి సంబంధించిన రిస్కులు సమంగా ఉన్నాయని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. వాతావరణం, అంతర్జాతీయ స్థాయి ముడి సరుకుల ధరలు, విత్తన నిధుల ప్రవాహం వంటి అంశాలపై బాగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది.అంతిమంగా చెప్పాల్సిందేమిటంటే, మార్చి నెలలో వచ్చిన ఈ గణాంకాలు సామాన్య ప్రజానికానికి కొంత ఊరటను ఇచ్చాయి. ధరలు నియంత్రణలో ఉండటం వల్ల ప్రజలు ఇక కొన్ని నెలల పాటు ఉపశమనం పొందే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read Also : Modi : ప్రధాని మోడీ ఏపీ టూర్ వాయిదా