జగన్‌ ఇంటి దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ కు సీఎం చంద్రబాబు వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఇష్టంగా కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ ను ప్రభుత్వం అధీనం చేసుకోగా…అక్రమంగా కట్టిన వైసీపీ పార్టీ ఆఫీసులను కూల్చి వేస్తూ వస్తుంది. అలాగే తాడేపల్లి లోని జగన్ నివాసం రోడ్డు ను కూడా పబ్లిక్ లోకి తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు జగన్‌ ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్లను సైతం తొలగించి పెద్ద షాక్ ఇచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన భద్రతలో భాగంగా తాడేపల్లి నివాసానికి వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్‌ బొలార్డ్స్‌, టైర్ కిల్లర్స్‌ను పూర్తిగా తొలగించారు.

అలాగే జగన్ నివాసానికి పార్క్ విల్లాస్ ద్వారా వెళ్లే రోడ్డులో చెక్‌‌పోస్ట్‌లు ఉన్నాయి.. వాటిని కూడా అధికారులు అక్కడి నుంచి తొలగించారు. తాడేపల్లి నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రోడ్డులో రాకపోకలు మరింత సులభంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు. అలాగే ఇంటికి సమీపంలో రోడ్డుపై వేసిన రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లు, ఆంధ్ర రత్న పంపింగ్‌ స్కీం వైపు ఉన్నటువంటి పోలీసు చెక్‌పోస్టును అధికారులు తొలగించారు. జగన్ నివాసం దగ్గర తొలగించిన సామగ్రిని లారీలో అక్కడి నుంచి తరలించారు.