యూపీ సర్కారు వీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు చేసిందని ఆగ్రహం
కోల్‌కతా : ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళాకు సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. ఇటీవలే అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటననను ప్రస్తావిస్తూ.. మహాకుంభ్‌ను ‘మృత్యు కుంభ్’గా అభివర్ణించారు.

ఇంత సీరియస్ ఈవెంట్‌ను ఎందుకు ఓవర్ హైప్
కుంభమేళాకు వచ్చే వీఐపీలకు మాత్రం ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. పేదలను మాత్రం విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ‘దేశాన్ని విభజించేందుకు మతాన్ని అమ్ముతోంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత సీరియస్ ఈవెంట్‌ను ఎందుకు ఓవర్ హైప్ చేశారంటూ..? యూపీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
కుంభమేళా అంటే తనకు గౌరవం ఉందన్నమమతా బెనర్జీ
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో దీదీ మాట్లాడుతూ.. ‘అది ‘మృత్యు కుంభ్’. నేను మహాకుంభ్‌ను గౌరవిస్తాను. పవిత్ర గంగామాతనూ గౌరవిస్తా. కానీ అక్కడ సరైన ప్రణాళిక లేదు. ధనవంతులు, వీఐపీలకు ప్రత్యేక క్యాంపులు ఉన్నాయి. రూ.లక్షలు వెచ్చించి ప్రత్యేక టెంట్లు బుక్ చేసుకునే వ్యవస్థ ఉంది. కానీ పేదలకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలాంటి కార్యక్రమాల్లో (మేళా) తొక్కిసలాట ఘటనలు సాధారణమే. కానీ అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేయడం ముఖ్యం. ఇక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?’ అంటూ యూపీ సర్కార్‌ను దీదీ ప్రశ్నించారు.