అర్హులైన వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పౌరసరఫరా శాఖ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాటు చేయాలి ఆదేశించిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

కొత్త కార్డులకు సంబంధించి డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి
మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మీ-సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న నేపథ్యంలో.. ప్రజలు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. కాగా, రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని.. ఆ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా.. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పలు డిజైన్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు.
ఆ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రేషన్ కార్డులు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. ఎలక్షన్ కోడ్ ఉన్న జిల్లాలు మినహాయించి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో మొదటగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. కాగా.. ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.