తెలంగాణలో రేషన్ కార్డు అప్లికేషన్ల పరిశీలన షురూ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను పూర్తి చేసే పనిలో తెలంగాణ సర్కార్ నిమగ్నమైంది. ఇప్పటికే పలు హామీలను అమల్లోకి తీసుకురాగా..మధ్యలో లోక్ సభ ఎన్నికలు రావడం తో మిగతా హామీలకు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తివేయడం తో మిగతా హామీలను అమలు చేసే దిశగా అడుగులేస్తోంది. కొత్త రేషన్ కార్డు జారీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అర్హులకే కార్డులను జారీ చేసే విషయంలో క్షేత్రస్థాయిలో అప్లికేషన్ల వడపోత కార్యక్రమాన్నిమొదలుపెట్టింది.

పౌరసరఫరాల శాఖ అధికారుల ఆదేశాలతో అర్హులను గుర్తించే పనిని అధికారులు మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు జిల్లాల్లో ఇంటింటి సర్వే చేయాలని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులను ఆదేశించగా మిగతా జిల్లాల్లో మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతోందని తెలుస్తోంది. దీంతో గ్రామాల్లో అర్హులను తేల్చేందుకు మహిళా సంఘాల ద్వారా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు, ధరణి తదితరాల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిగణలోకి తీసుకొని సర్వేలు చేస్తున్నారు.