అరసవల్లి: రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. కాగా క్షీరాభిషేకం కోసం భక్తులు బారులు తీరారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఆదిత్యుడి దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

అరసవల్లి సూర్యనారాయణ స్వామి నిత్యం పూజలందుకునే దేవాలయం. రథసప్తమి జయంతి రోజు ఇంద్ర పుష్కరిణి వద్ద మహిళలు సూర్యనారాయణ స్వామికి ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి పెడితే ఆయురారోగ్యాలు ఉంటాయని నమ్మకంతో అక్కడే నైవేద్యం తయారుచేస్తారు. ఆ నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టం అని చెప్తారు. ఆవు పిడకలను పెట్టి దానిపై ఒక ఒక మట్టి కుండను పెట్టి అందులో ఆవు పాలు వేసి పాలు బాగా మరిగిన తర్వాత ఆ పాలలో కొంచెం బియ్యం వేస్తారు. బియ్యం వేసిన తర్వాత చిన్న బెల్లం రేగు కాయలు వేసి చెరుకు గెడతో కలుపుతారు. చెరుకులో ఉండే తీపిదనం దానికి పాలకు వచ్చి ఎంతో రుచిగా మారుతుందని చెబుతారు. ఆ నైవేద్యాన్ని చిక్కుడు ఆకులపై వేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. దీనికోసం మహిళలు ఉదయాన్నే నాలుగు గంటల నుంచి కూడా ఇంద్ర పుష్కరిణి దగ్గరకు వచ్చి సూర్యోదయం అయ్యే సమయం కల్లా పాలు పొంగించి స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉంటారు.
ఇక, అరసవల్లి సూర్యదేవాలయం విశిష్టతపై పరిశీలిస్తే ఏడు అశ్వాలతో కూడిన రథంపై దేదీప్యమానంగా మూలవిరాట్ భక్తులకు దర్శనమిస్తుంటాడు. అరుణశిలతో చేసిన ఉత్సవ విగ్రహం భక్తలకు కనువిందు చేస్తుంది. స్వామివారి రెండు హస్తాల్లోని తామర పద్మాలు అబ్బురపరుస్తాయి. కఠారి అనే చురిక (కత్తి) నడుము వద్ద ఆయుధంగా ధరిస్తారు. ఆలయానికి భువనేశ్వరిదేవి సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.