మళ్లీ న్యాయపరమైన చిక్కుల్లో రామ్‌దేవ్‌బాబా

ramdev baba
ramdev baba

న్యూఢిల్లీ: యోగా గురు రామ్‌దేవ్‌ బాబా నేతృత్వంలోని ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడింది. శాకాహారంగా విక్రయించబడుతున్న ఆ కంపెనీకి చెందిన దంత సంరక్షణ ఉత్పత్తి అయిన ‘దివ్య మంజన్‌’ లో మాంసాహార పదార్థాలు ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది యతిన్‌ శర్మ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

అధికారిక వెబ్​సైట్​లో గ్రీన్​ డాట్‌తో సంస్థ తన ఉత్పత్తిని విక్రయిస్తోందని, ఇది శాకాహారి అని సూచిస్తుందని తెలిపారు. అయితే, లోపల ఉన్న ఇన్‌గ్రీడియెంట్స్‌తో చూస్తే ఇది విరుద్దంగా ఉందంటూ పేర్కొన్నారు. ఆ ప్రొడక్ట్‌లో సముద్రఫెన్ అనే చేపలకు సంబంధించిన మూలాలను వాడినట్లు ఇటీవలే జరిపిన పరిశోధనల్లో వెల్లడైందని తన పిటిషన్‌లో వివరించారు. అలాంటప్పుడు ‘దివ్య మంజన్’‌ను శాకాహార ఉత్పత్తిగా ఎలా బ్రాండింగ్ చేస్తారని సదరు పిటిషనర్ ప్రశ్నించారు.

మతవిశ్వాసాల వల్ల తాను, తన కుటుంబ సభ్యులు శాకాహారం మాత్రమే తింటామని.. ‘దివ్య మంజన్’‌లో చేప మూలాలు ఉన్నాయని తెలిసి చాలా కలత చెందామని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 28కి వాయిదా వేసింది.