ఐదేళ్లూ నిరభ్యంతరంగా ఈ మహాపాపం కొన‌సాగింది: రమణ దీక్షితులు

Ramana Dikshitulu reacts on the Tirumala Laddu controversy

అమరావతి: తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాదంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్పందించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుమ‌ల‌లో ప్రసాదాల నాణ్యతపై గ‌తంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఆయ‌న‌ పేర్కొన్నారు. గతంలో ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్‌, ఈఓ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. కానీ తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారు.

తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకురాలేదని చెప్పారు. దీంతో గత ఐదు సంవత్సరాలు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్‌ రిపోర్టులు చూశానని రమణ దీక్షితులు తెలిపారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని అన్నారు.

పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదని చెప్పారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. దీనికోసం సీఎం ఎన్నో చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. కర్ణాటకలోని నందిని డెయిరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని రమణదీక్షితులు చెప్పారు.