తెలంగాణలో ఐదురోజులపాటు వర్షాలే వర్షాలు

heavy-to-heavy-rainfall-alert-for-rayalaseema-on-dec-3

తెలంగాణలో రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ను ఇష్యూ చేసింది. రానున్న ఐదు రోజులు అనగా నేటి నుంచి జూన్‌ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయిని.. చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

నైరుతి రుతపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో కూడా ఉండటం వల్ల.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. అంతేకాక గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయ, ఇతరాత్ర పనుల కోసం బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందని.. ఆవర్తనం కారణంగా తెలంగాణతో పాటు ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ఆసిఫాబాద్‌, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయి అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు.