YELLOW ALERT : ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో మరోసారి స్వల్ప నుండి భారీ వర్షాలు పడబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్‌లోని గంగవరంలో అత్యధికంగా 6.86 సెంటీమీటర్ల వాన పడిందని వెల్లడించింది. ఈ నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలో 364 మిల్లీమీటర్ల వర్షం కురువాల్సి ఉండగా 461 మిల్లీమీటర్లు కురిసిందని పేర్కొంది.

ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ఇద్దరు బాలలు సహా ఆరుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. డ్రెయిన్లను మూయడంలో, విద్యుత్తు తీగలను సురక్షితంగా ఉంచడంలో అధికారుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో సాధారణం కంటే అధికం వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నదని ఐఎండీ అంచనా వేసింది. ఆగస్టు మాసాంతానికి లానినా పరిస్థితులు మెరుగుపడతాయని, ఫలితంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో భారత్‌లో కురిసే వర్షపాతం దీర్ఘకాల సగటు 422.8 మిల్లీమీటర్లలో 108 శాతంగా ఉంటుందని పేర్కొన్నది. జూన్‌ 1 నుంచి చూసుకుంటే దేశ సగటు వర్షపాతం 445.8 మి.మీ. కాగా ఇప్పటికే 453.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయువ్య భారతంలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.