లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ

లోక్‌సభలో విపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నియమితులయ్యారు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. మోదీని దీటుగా ఎదుర్కొనేది రాహుల్‌ ఒక్కడేననే అభిప్రాయంతో ఈ నెల 9న జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం కూడా విపక్ష నేత విషయంలో ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌కు లేఖ ద్వారా పంపినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

గడిచిన పదేళ్లుగా లోక్‌సభలో విపక్ష నేత హోదా ఖాళీగా ఉంది. ఏదైనా పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందాలంటే.. మొత్తం సీట్లలో 10ు స్థానాల్లో గెలిచి ఉండాలి. ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లున్నాయి. అంటే.. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 54 సీట్లు తప్పనిసరి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో.. కాంగ్రెస్‌ 44 సీట్లతో సరిపెట్టుకుంది. 2019లో కూడా కాంగ్రెస్‌ పార్టీ 52 స్థానాలను దక్కించుకోగా.. ప్రధాన ప్రతిపక్ష హోదాకు రెండు సీట్లు తక్కువయ్యాయి. ఈ సారి 99 మంది ఎంపీలుండడంతో.. కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.