కాంగ్రెస్‌ గెలవగానే.. కార్మికులతో సీఎం సహా మంత్రులంతా సమావేశంః రాహుల్ గాంధీ

Rahul Gandhi interacts with auto drivers, gig workers in Telangana

హైదరాబాద్‌ః ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో పారిశుద్ధ్య కార్మికులు, గిగ్‌ వర్కర్లు, డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వారి సాధకబాధలు తెలుసుకున్నారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల బారినపడుతున్నామని.. ప్రమాద బీమా కల్పించాలని డెలివరీ బాయ్స్‌ రాహుల్​ను కోరారు.

మరోవైపు జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగులను వేధిస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించారు. రెండుపడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని రాహుల్​తో తమ గోడు వెల్లబోసుకున్నారు. కాంట్రాక్టర్లు 11 గంటలు పనిచేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదుపాయాలు అడిగితే ఉద్యోగం మానేయమంటున్నారని వాపోయారు.

“పోలీసులు చలాన్లతో వేధిస్తున్నారని క్యాబ్‌, ఆటో డ్రైవర్లు చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు విన్న రాహుల్ గాంధీ తమకు ఒక్క అవకాశం ఇస్తే అధికారంలోకి రాగానే అవన్నీ పరిష్కరిస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్‌ గెలవగానే.. కార్మికులతో సీఎం సహా మంత్రులంతా సమావేశమై మీ సమస్యలను చర్చించి పరిష్కారాన్ని చూపిస్తారు” అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.