రాహూల్‌ గాంధీ .. అశోక్‌నగర్‌ వచ్చి మీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో యువతకు తెలపండి: కేటీఆర్‌

Rahul Gandhi .. come to Ashoknagar and tell the youth how to keep your promise: KTR

హైదరాబాద్‌: ‘రాహుల్ గాంధీ గారూ… మీరు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు మరోసారి వచ్చి.. యువతను కలిసి మీరు ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకుంటారో వారికి వివరించగలరా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ చేశారు. ఈ మేరకు నవంబర్ 27, 2023న రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను కూడా ఆయన రీట్వీట్ చేశారు.

ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనే మీ హామీలను తెలంగాణ యువత నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. పైగా నిన్న ఉద్యోగాలే లేని క్యాలెండర్‌ను విడుదల చేశారని, దీంతో యువత ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. అందుకే మీరు మరోసారి అశోక్ నగర్ కు చ్చి.. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలన్నారు. దీనికి రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు చేసిన ట్వీట్‌ను జత చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, యూపీఎస్‌సీలా టీపీఎస్‌సీని ప్రక్షాళన చేస్తామని, యువవికాసం కింద రూ.5 లక్షల సహకారం అందిస్తామని రాహుల్ గాంధీ నాడు చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.

కాగా, శుక్రవారం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. పోస్టుల సంఖ్య లేకుండా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గన్‌పార్క్‌ వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘తొమ్మిది నెలల కిందట ఉద్యోగాల పేరిట ఎంత డ్రామా చేసిండ్రు..కేసీఆర్‌ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్టు తప్పుడు ప్రచారం చేసిండ్రు. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలని పత్రికల్లో ఊదరగొట్టే విధంగా అక్రమ సంపాదనతో కాంగ్రెస్‌ నాయకులు ప్రకటనలిచ్చిండ్రు. రాహుల్‌ గాంధీని అడుగుతున్న, నువ్వు ప్రామిస్‌ చేసిన రెండు లక్షల ఉద్యోగాలేవీ?’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.