నేడు వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Rahul Gandhi and Priyanka Gandhi will visit Wayanad today

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభలో విపక్షనాయకుడు రాహుల్‌ గాంధీ యనాడులో పర్యటించనున్నారు. సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఢిల్లీ నుంచి వరద బాధిత వయనాడుకు ఆయన బయల్దేరారు. కొండచరియలు విరిగిపడి ఘటన, వరద బాధితులను పరామర్శించనున్నారు. కాగా, బుధవారమే ఇరువు నేతలు వయనాడ్‌లో పర్యటించాల్సి ఉన్నది. అయితే ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పర్యటనను వాయిదావేసుకుంటున్నట్లు ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌ వెల్లడించారు. త్వరలో అక్కడికి వెళ్తామన్నారు.

ప్రకృతి ప్రకోపానికి వయనాడ్‌ మరుభూమిగా మారిపోయింది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. చలియార్‌ నదిలో శవాలు కొట్టుకొస్తూనే ఉన్నాయి. వందలాది ఇండ్ల ఆనవాళ్లే కనిపించడం లేదు. కొండచరియలు విరిగిపడటంతో బురదలో కూరుకుపోయిన ఇండ్ల శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలను ఆర్మి, సహాయక బృందాలు వెలికితీస్తున్నారు. ఇప్పటికీ వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ దొరకడం లేదు.

కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటివరకు 270 మృతదేహాలు లభ్యమయ్యాయి. చలియార్‌ నదిలో కొట్టుకువచ్చిన 83 మృతదేహాలను బయటకు తీశారు. 166 మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్‌ పూర్తికాగా, 32 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఇప్పటికీ అధికారికంగా 200 మంది ఆచూకీ దొరకడం లేదు. 191 మంది తీవ్ర గాయాలతో వేర్వేరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం 45 సహాయక శిబిరాలు ఏర్పాటుచేసి 3,069 మందిని తరలించింది. ఇప్పటికే విరిగిపడ్డ కొండచరియలను చాలావరకు తొలగించలేదు. అనేక ఇండ్లలోకి సహాయక సిబ్బంది చేరుకోలేదు. దాదాపు 500 ఇండ్లు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో, మృతులు, గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది.