నరసరావుపేటలో కోరలు చాచిన ర్యాగింగ్

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాగింగ్ కలకలం రేపింది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఫిబ్రవరి 2న ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల హాస్టల్ ఆవరణలో ఎన్‌సిసి శిక్షణ ఇప్పిస్తామనే నెపంతో 10 మంది డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. చివరి సంవత్సరం విద్యార్థులు తమ జూనియర్లను కర్రలతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నరసరావుపేటలోని శ్రీ సుబ్బారాయ, నారాయణ కళాశాలలో హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి సంవత్సరం విద్యార్థులను తమ హాస్టల్ గదులకు పిలిపించుకున్న కొందరు సీనియర్లు భౌతికంగా దాడి చేయడం, వారిని ఇష్టానుసారంగా కొట్టడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. జూనియర్లను కొడుతూ నవ్వుకోవడం, దుర్భాషలాడడం, ఇంకా గట్టిగా కొట్టాలంటూ చెప్పుకోవడం ఇందులో వినిపించింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు స్పందించారు. ఆరుమంది విద్యార్థులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణా రెడ్డి తెలిపారు.

ఈ ఘటనపై బాధిత విద్యార్థులు గానీ, కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయలేదని సీఐ పేర్కొన్నారు. వీడియో ఇప్పుడు వెలుగులోకి రావడంతో బాధిత విద్యార్థుల నుంచి ఫిర్యాదు అందాయని తెలిపారు. ర్యాగింగ్ నిషేధ చట్టం 2011లోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.