భారత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఈరోజు ఉదయ్‌పూర్‌లోని రఫల్స్ స్టార్ హోటల్లో జరగబోతోంది. సింధు, దత్త సాయి కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం నుంచే వేడుకల కోసం ఉదయ్‌పూర్ చేరుకున్నారు.
ఈ వివాహ మహోత్సవానికి 140 మంది అతిథులు మాత్రమే ఆహ్వానితులుగా ఉన్నారు. వీరి కోసం హోటల్లో వంద గదులు ప్రత్యేకంగా బుక్ చేశారు. శనివారం మెహిందీ, సంగీత్ కార్యక్రమాలు జరగగా, ఈ సందర్భంగా వధూవరులు ప్రత్యేక ఫోటోషూట్ కూడా నిర్వహించారు. వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యులు సందడిగా పాల్గొన్నారు. రాజస్థాన్ ప్రత్యేకతలు ప్రతిఫలించేలా వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివాహ వేడుక దక్షిణ భారత సంప్రదాయాల ప్రకారం జరుగుతుండగా, రాజస్థాన్ రాచరిక సొబగులతో అతిథులను స్వాగతం పలికారు. వివాహ భోజనంలో ప్రత్యేక వంటకాలను అందించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
పీవీ సింధు తన వివాహ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. వివాహ అనంతరం మంగళవారం (24న) హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.