రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలోనే మరణిస్తారని, ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు.
గుండెపోటు వచ్చిందా?
జెలెన్ స్కీ ప్రకటన ప్రకారం, రష్యా అధ్యక్షుడికి ఇటీవల గుండెపోటు వచ్చిందన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ మాట్లాడుతూ..”పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. త్వరలో ఆయన ఇక ఉండరు. పుతిన్ మరణిస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుంది. శాంతి కోసం రష్యాపై అంతర్జాతీయ ఒత్తిడి పెరగాలి” అని వ్యాఖ్యానించారు.

రష్యాపై ఒత్తిడి పెరుగుతుందా?
అమెరికా ప్రతిపాదించిన పాక్షిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఇప్పటికే అంగీకారం తెలిపింది. అయితే, రష్యాను ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో అమెరికా మద్దతుతో సౌదీ అరేబియాలో రష్యా ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు రష్యాపై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలను కోరుతున్నాయి.
పుతిన్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు
ఇటీవల రష్యా అధ్యక్షుడు అనారోగ్యంతో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి గోప్యంగా ఉంచుతున్నారని పలు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలపై రష్యా నుంచి ఎటువంటి అధికారిక స్పందన ఇంకా రాలేదు. పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై క్రెమ్లిన్ గతంలో స్పందిస్తూ అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది.