రెండో రోజు ప్రారంభమైన పూరి జగన్నాథుడి రథయాత్ర

Puri Jagannath Rath Yatra started on the second day

పూరిః సోమవారం రెండో రోజు ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండురోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1971లో రెండు రోజులపాటు రథయాత్ర జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ యాత్రను రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన నేడు జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ నలమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.

వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథ యాత్ర ఆదివారం శోభాయమానంగా సాగిన విషయం తెలిసిందే. భక్తులు ‘జై జగన్నాథ్‌’, ‘హరిబోల్‌’ నినాదాలతో మూడు రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచ దేవాలయం వైపు లాగుతూ తీసుకెళ్లారు. రథయాత్రకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. లాంఛనంగా శ్రీ జగన్నాథుని రథాన్ని లాగి రథయాత్రను ప్రారంభించారు. రాష్ట్రపతి రథయాత్రకు హాజరవ్వడం ఇదే తొలిసారి. గతంలో ఎవరూ హాజరుకాలేదు.

కాగా, తొలి రోజు రథయాత్రలో అపశ్రుతి చోటచేసుకుంది. రథం లాగుతుండగా భక్తుల మధ్య జరిగిన స్వల్ప తోపులాటలో ఒకరు మరణించగా.. 300 మంది స్వ ల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే దవాఖానలకు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చే చెరాపహరా కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత బలభద్రుని తాళ ధ్వజ రథాన్ని ముందుకు నడిపిస్తుండగా జరిగిన తోపులాటలో ఒక భక్తుడు మరణించాడు.