దక్షిణ కొరియా పాటలు విన్నాడని యువకుడి ఉరి

సౌత్ హ్వాంఘ్వే ప్రావిన్స్‌కు చెందిన యువకుడు 70 కే-పాప్ (కొరియా పాప్యులర్) పాటలు వినడంతోపాటు మూడు సినిమాలు చూసిన కేసులో దోషిగా తేలడంతో అతడిని బహిరంగంగా ఉరి వేసిన ఘటన ఉత్తర కొరియాలో చోటుచేసుకుంది. దక్షిణ కొరియా మ్యూజిక్ వినడం, సినిమాలు చూడడమే అతడు చేసిన నేరమని తెలిపింది ఉత్తర కొరియా మానవహక్కుల సంఘం. 2022లో ఈ ఘటన జరగ్గా ఉత్తర కొరియా మానవహక్కుల సంఘం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.

సౌత్ కొరియా పాప్ కల్చర్‌ను నిషేధించే ‘రియాక్షనరీ ఐడియాలజీ అండ్ కల్చర్’ చట్టాన్ని యువకుడు ఉల్లంఘించినట్టు అభయోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అవి నిజమని తేలడంతో బహిరంగంగా మరశిక్ష అమలుచేశారు. సౌత్ కొరియాను ఆగర్భ శత్రువుగా భావించే కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హయాంలోనే ఇలాంటి చట్టాలు రూపొందగా, కిమ్ హయాంలో ఇవి మరింత తీవ్రరూపం దాల్చాయి. కె-పాప్, కె-డ్రామా అనేవి దక్షిణ కొరియా సినిమాలు, సంగీతానికి రూపాలు. ఇటీవల వీటిపై నార్త్ కొరియా యువత మనసు పారేసుకుంటోంది. జీవితంలో ఇలాంటి ఏ వినోదమూ లేకుండా ఇలా నిస్సారంగా బతకడం కంటే చావు మేలంటూ ఉత్తర కొరియా యువత బహిరంగంగానే చెబుతూ చట్టాలను ధిక్కరిస్తోంది.