జూడాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మమతా బెనర్జీ

హత్యాచార కేసుపై చర్చించకుండా తనను పదేపదే అవమానించడం సరికాదని బెంగాల్ CM మమతా బెనర్జీ జూడాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ నివాసం వద్ద శనివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. సీఎంతో చర్చల కోసం వచ్చిన జూనియర్ డాక్టర్లు దాదాపు రెండు గంటల పాటు బయటే వేచి ఉన్నారు. సీఎంతో తమ చర్చలు లైవ్ స్ట్రీమింగ్ జరగాలని వారు పట్టుబట్టారు. దీనికి అధికార యంత్రాంగం ఒప్పుకోకపోవడంతో వారు వెనుదిరిగారు. అంతకుముందు జూనియర్ డాక్టర్ల ప్రతినిధి బృందానికి సీఎం మమతా బెనర్జీ పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

‘ప్లీజ్.. లోపలికి రండి మాట్లాడుకుందాం. మీరు కోరితేనే కదా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. చర్చలు వద్దంటే కనీసం నాతో టీ తాగి వెళ్లండి. ఎందుకిలా నన్ను అవమానిస్తున్నారు?’ అంటూ మమత వాపోయారు. ఈ మీటింగ్ సందర్భంగా రాజకీయాల గురించి మర్చిపోదామని, మీటింగ్ లో చర్చించిన అంశాలపై ఓ నివేదిక తయారు చేసి దానిపై తాను సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకానీ మీటింగ్ లైవ్ స్ట్రీమింగ్ కుదరదని, సుప్రీంకోర్టు అనుమతి ఉంటే తప్ప లైవ్ స్ట్రీమింగ్ చేయలేమని వివరించారు.

‘మొన్న కూడా చర్చలకు వస్తామంటే 2 గంటలు వెయిట్ చేశా. ఇప్పుడూ మీటింగ్కు రాకుండా ఇంటిముందు నిరసన చేస్తున్నారు. నన్ను ఇలా అవమానించొద్దు. నాతో మాట్లాడటం ఇష్టంలేకపోతే ఇంట్లోకి వచ్చి కప్పు చాయ్ తాగి వెళ్లండి’ అని ఆమె కోరారు.