మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ(82) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ కు లేఖలో తమ సంతాప సందేశాన్ని అందించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. సోదరి మరణానికి చింతిస్తున్నట్లు తెలిపారు. ఆమె కుటుంబానికి, మీకు సానుభూతి తెలుపుతున్నానని ప్రధాని మోడీ కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ బాధ నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నం కావాలని మోడీ లేఖలో ఆకాంక్షించారు.

కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడ్డారు. ఆమె ఈ నెల 23న అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ జనవరి 25న తుదిశ్వాస విడిచారు. కేసీఆర్ కు సకలమ్మ ఐదో సోదరి, సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పెదిర్ అనే గ్రామానికి చెందినవారు. ఆమె భర్త హనుమంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు.