ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ..?

Prime Minister Modi will address the United Nations..?
Prime Minister Modi will address the United Nations..?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి 79వ సర్వసభ్య ప్రతినిధి అత్యున్నత స్థాయి సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ అంతర్జాతీయ వేదికపై సెప్టెంబర్ 26న మోడీ ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన ప్రొవిజినల్‌ జాబితాలో భారత ప్రధాన మంత్రి పేరు కూడా ఉంది. సెప్టెంబరు 24 నుంచి 30వ తేదీ వరకు ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్‌ దేశాధినేత ప్రసంగంతో సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఆ తరువాత అమెరికా అధినేత మాట్లాడుతారు.. సెప్టెంబర్ 26న తేదీ మధ్యాహ్నం భారత దేశాధినేత ప్రసంగం ఉంటుందని ఐరాస తమ జాబితాలో పేర్కొంది. అయితే, ఇది తుది జాబితా కాదు.. సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులు, షెడ్యూల్‌లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంది.

కాగా, గతేడాది ఐక్యరాజ్య సమితి సర్వసభ్య భేటీకి ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. తొలుత ప్రధాని ప్రసంగం ఉంటుందని ఐరాస ప్రకటించగా.. ఆ తర్వాత మార్చిన జాబితాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ పేరును చేర్చింది. అంతకు ముందు 2021 సెప్టెంబరులో జరిగిన వార్షిక సమావేశాల్లో ఐరాస వేదికపై ప్రధాని మోడీ ప్రసంగం చేసేశారు. ఇటీవలే మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మోడీ.. ఈసారి ఐక్యరాజ్యసమితి భేటీకి హాజరయ్యే ఛాన్స్ ఉంది. గతేడాది జరిగిన సర్వసభ్య సమావేశాలకు కొన్ని నెలల ముందు జూన్‌ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయానికి మోడీ వెళ్లారు. ఇక, ఈ ఏడాది జరిగే సమావేశాల్లో గ్లోబల్‌ డిజిటల్‌ కాంపాక్ట్‌పై తీర్మానం చేసే ఛాన్స్ ఉంది.