మూడ్రోజుల పర్యటన కోసం బ్రూనై బయల్దేరిన ప్రధాని మోడీ

Prime Minister Modi left for Brunei for a three-day visit

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ మూడ్రోజుల పర్యటన నిమిత్తం బ్రూనై దారుస్సలాం, సింగపూర్ బయలుదేరి వెళ్లారు. బ్రూనైలో భారత ప్రధాని మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం. ఈరోజు, రేపు బ్రూనైలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రేపు సాయంత్రం సింగపూర్‌కి బయలుదేరి వెళ్తారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మోడీ ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. బ్రూనై దారుస్సలాంలో మొట్టమొదటిసారిగా ద్వైపాక్షిక పర్యటనకు వెళ్తున్నానని… ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 40 సంవత్సరాల సందర్భంగా…. చారిత్రక సంబంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చడానికి హిజ్ మెజెస్టి సుల్తానా, హాజీ హసనల్ బోల్కియా, ఇతర రాజకుటుంబ సభ్యులతో సమావేశాలు ఉంటాయని మోడీ తెలిపారు.

సింగపూర్‌ రాష్ట్రపతి థర్మన్ షణ్ముగరత్నం, ప్రధాని లారెన్స్ వాంగ్ సహా అక్కడి మంత్రులతో ప్రధాని భేటీ కానున్నారు. సింగపూర్ పర్యటనలో అక్కడి బిజినెస్ ఆర్గనైజేషన్ సంఘాలతోనూ సమావేశం ఉంటుందని మోడీ తెలిపారు. బ్రూనై, సింగపూర్‌లతో భారత్‌ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు, ఆసియాన్‌ కూటమితో తమ బంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ పర్యటనలు ఎంతగానో దోహదపడతాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.