ఒక భవిష్యత్ అంతా భారత్ దే – రాష్ట్రపతి ద్రౌపదీ

18వ లోక్‌సభ సమావేశాల వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తొలుత రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంట్‌ చేరుకున్న రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రజల విశ్వాసం గెలిచి సభకు ఎన్నికయ్యారని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతం అవుతారని ఆశిస్తున్నానన్నారు. ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. ప్రపంచమంతా భారత ఎన్నికలను నిశితంగా పరిశీలించిందని రాష్ట్రపతి అన్నారు. పౌర విమానయాన రంగం అనేక మార్పులు తెచ్చామన్నారు. టైర్‌ 2, 3 నగరాల్లో విమానాశ్రయాలు నిర్మిస్తున్నామన్నారు.

ఇటీవల నీట్‌ యూజీ, నెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాల గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్‌ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్‌, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్‌ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.