విదేశీ పర్యటన..ఫీజీ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

president-droupadi-murmu-arrives-in-fiji-on-a-state-visit

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈరోజు (ఆగస్ట్ 5వ తేదీ) నుంచి ఆరు రోజుల పాటు ఫిజీ , న్యూజిలాండ్, తిమోర్‌-లిస్తె దేశాల్లో ముర్ము పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి ఫిజీకి చేరుకున్నారు. రేపటి వరకూ ఫిజీ పర్యటనలోనే ఉండనున్నారు.

భారత రాష్ట్రపతి ఒకరు ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు విలియమ్ కటోనివెరే‌తోపాటు ఆ దేశ ప్రధాన మంత్రి సితివేణి రబుకా‌తో దైపాక్షిక చర్చల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఫిజీ పార్లమెంట్‌లో ఆ దేశ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదేవిధంగా భారత సంతతివారితో ముచ్చటించనున్నారు.

ఫిజీ పర్యటన అనంతరం ముర్ము న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్తారు. ఆగస్టు 7 నుంచి 9వ తేదీ వరకూ ఆ దేశంలో పర్యటిస్తారు. అక్కడ గవర్నర్‌ జనరల్‌, ప్రధాన మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 10న తిమోర్‌-లిస్తె చేరుకుంటారు. ఆ దేశాధ్యక్షుడు జోస్‌ రామోస్‌ – హోర్తాతో భేటీ అవుతారు.