కాంగ్రెస్‌ను వీడటం ఒక పొరపాటు నేను చింతిస్తున్నా..
కోల్‌కతా: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, లోక్‌సభ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాలుగేళ్లు తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న ఆయన బుధవారం పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ వ్యక్తి కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తాడు. అది సహజం. కాంగ్రెస్‌ను వీడటం ఒక పొరపాటు. నేను చింతిస్తున్నా అని అన్నారు.

కాగా, ఇంజినీర్ అయిన అభిజిత్ ముఖర్జీ రాజకీయాల్లోకి రాకముందు ప్రధాన కార్పొరేట్ సంస్థల్లో పనిచేశారు. తండ్రి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయిన తర్వాత 2012లో బెంగాల్‌లోని జాంగిపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో బీజేపీ అఖండ విజయం సాధించినప్పుడు కూడా ఆ స్థానాన్ని నిలుపుకున్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఖలీలూర్ రెహమాన్ చేతిలో ఆయన ఓడిపోయారు.
మరోవైపు 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత అభిజిత్ ముఖర్జీ ఆ పార్టీలో చేరారు. బీజేపీని నిలువరించడం ఒక్క మమతా బెనర్జీకి మాత్రమే సాధ్యమని కితాబు ఇచ్చారు. చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు ప్రాథమిక సభ్యత్వం తప్ప ఏ పదవి లేదా పాత్ర ఇవ్వలేదని ఆరోపించారు. అయితే తృణమూల్‌లో కూడా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.