జూబ్లీహిల్స్ పబ్ లో డ్రగ్స్ కలకలం..

డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు ఎక్క డికక్కడ నిఘా పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పబ్స్ గురించి చెప్పనక్కర్లేదు. పైకి పబ్‌గా కనిపిస్తున్నా, రాత్రి వేళ మాత్రం డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. డ్రగ్స్‌ను అరికట్టేందుకు సినీ సెలబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొన్ని పబ్స్ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి జోరా పబ్ లో వైట్ అండ్ వైట్ ఈవెంట్ జరుగుతుండడంతో నార్కోటిక్ బ్యూరో జూబ్లీహిల్స్ పోలీసులు సోదాలు జరిపారు.

ఈ సందర్భంగా డ్రగ్ ప్రైమరీ టెస్ట్ నిర్వహించగా పలుగురికి డ్రగ్స్ పాజిటివ్ నిర్దారణ అయింది. అందులో కొందరికి పాజిటివ్ రావడంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. జొర పబ్ లో యువకులకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు? ఎంతకాలంగా డ్రగ్స్ దందా నడుస్తోంది? ఎక్కడి నుండి డ్రగ్స్ తెచ్చారు? ఎంతకు విక్రయించారు? ఎవరెవరికి విక్రయించారు? వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదికాకుండా దుర్గం చెరువు సమీపంలోని ఓ పబ్‌లోనూ పోలీసులు సోదాలు చేసినట్టు వార్తలు వస్తున్నా యి. అందులో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు దొరికారా? లేదా అన్నది తెలియాల్సివుంది.