చిక్కడపల్లి లైబ్రరీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్..ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు

హైద‌రాబాద్‌లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఎమ్మెల్యే టీ హ‌రీశ్ రావు తీవ్రంగా ఖండించారు. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగ సంఘాల పిలుపు మేరకు భారీ ఎత్తున్న అభ్యర్థులు తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే గ్రూప్ 2, 3, డీఎస్సీ వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో చిక్కడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనగా భారీగా పోలీసులు బలగాలు లైబ్రరీ వద్దకు చేరుకుని ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరగగా.. పోలీసులు నిరుద్యోగులపై లాఠీ ఛార్జీ చేశారు. దీనిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.

గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం అని సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఇదేనా ప్రజా పాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హ‌రీశ్ రావు నిల‌దీశారు. నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట చిక్క‌డ‌ప‌ల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇప్పుడు అదే లైబ్ర‌రీకి పోలీసుల‌ను పంపి విద్యార్థుల వీపులు ప‌గుల‌గొడుతున్నార‌ని హ‌రీశ్ రావు మండి ప‌డ్డారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాల‌ని స్ప‌ష్టం చేశారు.