ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసు శాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను స్పష్టం చేశారు. ప్రవీణ్ మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. ప్రమాద సమయంలో ఆయన మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మూడు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు
పోలీసుల విచారణ ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో ప్రవీణ్ తన ఇంటి నుంచి బయలుదేరారు. దారిలో వైన్స్‌కు వెళ్లినట్టు సమాచారం. అనంతరం మూడు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలకు లోనైనట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని గమనించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, అలాగే సీసీటీవీ ఫుటేజీలను ఆధారంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.

ఎలాంటి కుట్ర కోణం లేదు
ఘటన స్థలాల్లోని సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసుల ప్రకారం, మద్యం మత్తులో ఆయన వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని తేలింది. ఎలాంటి కుట్ర కోణం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రవీణ్ మృతి విషాదకరమైనదే అయినప్పటికీ, ఇది యాక్సిడెంట్ మృతిగా మిగలే అవకాశమే ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు.