నేడు వయనాడ్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi's visit to Wayanad today
PM Modi’s visit to Wayanad today

వయనాడ్: కేరళ రాష్ట్రం వయనాడ్ లో ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వయనాడ్ బాధితులను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పరామర్శించనున్నారు. సహాయ, పునరావాస చర్యలను సమీక్షించనున్నారు. ఢిల్లీ నుంచి కేరళ బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఉదయం 11గంటలకు కన్నూర్ చేరుకుంటారు. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తారు. మధ్యాహ్నం 12:15 సమయంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మోడీ సందర్శిస్తారు. సహాయ శిబిరాలను, ఆసుపత్రిని మోడీ సందర్శిస్తారు.

కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని కలిసి మోడీ మాట్లాడతారు. మధ్యాహ్నం సమయంలో సహాయక చర్యలపై కేరళ సీఎం, ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష జరుపుతారు. అయితే, వయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాలని కేరళ ప్రభుత్వం, ఆ రాష్ట్ర విపక్ష పార్టీలు కోరుతున్నారు. ఈ సమావేశంలో మరోసారి ప్రధాని ఎదుట జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరనున్నారు. ఇప్పటికే వయనాడ్ విపత్తు నుంచి బయటపడేందుకు 2000 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించాలని కేంద్రాన్ని కేరళ ప్రభుత్వం కోరింది.

జూలై 30న కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో వయనాడ్ లో 226 మంది మృతి చెందగా.. 197 శరీర భాగాలను సహాయక సిబ్బంది గుర్తించారు. ఆసుపత్రుల్లో 78 మంది చికిత్స పొందుతున్నారు. భయంకరమైన విషాదం గురించి తెలుసుకునేందుకు ప్రధాని మోడీ వయనాడ్‌ను వెళ్తుండటం పట్ల మోడీకి లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఇది మంచి నిర్ణయం అని రాహుల్ అన్నారు. ఒకసారి ప్రధాని విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన తరువాత దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే ఆగస్టు 1న వయనాడ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు పర్యటించారు.