నేడు నీతి ఆయోగ్ భేటీ..బాయ్‌ కాట్‌ చేస్తున్న రాష్ట్రాలు ఇవే

ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం శనివారం జరగనుంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ‘వికసిత్‌ భారత్‌-2047’ పేరుతో నీతి ఆయోగ్‌ ఇప్పటికే ఒక ఆధారపత్రాన్ని రూపొందించింది.

ఈ సమావేశానికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులు దూరంగా ఉండనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో వివక్ష చూపడం, రాష్ట్రాల హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ఆయా రాష్ట్రాల సిఎంలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ హాజరుకాలేమని ప్రకటించారు. హాజరు కానీ సీఎంలు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, పంజాబ్‌, జార్ఖండ్‌ సిఎంలు భగవంత్‌ మాన్‌, హేమంత్‌ సోరెన్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎ.రేవంత్‌ రెడ్డి (తెలంగాణ), సిద్ధరామయ్య (కర్ణాటక), సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖ్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) ఉన్నారు. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్‌ జైలులో ఉండడం వల్ల ఆయన హాజరుకాలేరు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై, నిరసన తెలుపుతానని ప్రకటించారు.

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్నసీఎంలు వీరే..

  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే
  • ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
  • అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ
  • అరుణాచల్ ఉప ముఖ్యమంత్రి చౌనా మే
  • త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా
  • అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ
  • ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ
  • ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి
  • గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
  • రాజస్థాన్ ముఖ్యమంత్రి భజజన్‌లాల్ శర్మ
  • మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా