వ్యవసాయ ఆర్ధిక వేత్తల అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగం

pm-modi-to-address-global-conference-of-agricultural-economists

న్యూఢిల్లీ: ఢిల్లీలోని నేషనల్‌ అగ్రికల్చర్‌ సైన్స్ సెంటర్‌ కాంప్లెక్స్‌లో శనివారం జరిగే 32వ వ్యవసాయ ఆర్ధికవేత్తల అంతర్జాతీయ సదస్సు ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రారంభోపన్యాసం చేస్తారని పీఎంఓ వెల్లడించింది. 65 ఏండ్ల తర్వాత భారత్‌లో ఐసీఏఈ జరగనుంది. నిలకడైన వ్యవసాయ ఆహార వ్యవస్ధల దిశగా ప్రస్ధానం అనే అంశాన్ని ఈ ఏడాది సదస్సు థీమ్‌గా ఎంచుకున్నారు.

వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత, ఉత్పాదక వ్యయాల పెరుగుదల, వివాదాలు వంటి పలు అంతర్జాతీయ సవాళ్ల నేపధ్యంలో నిలకడైన వ్యవసాయ వృద్ధి అవసరాన్ని నొక్కిచెబుతూ ఈ సదస్సు సాగుతుంది. వ్యవసాయ పరిశోధన, విధానాల్లో భారత్‌ సాగిస్తున్న పురోగతి, అంతర్జాతీయ వ్యవసాయ సవాళ్లను దీటుగా ఎదుర్కొనే క్రమంలో దేశ సామర్ధ్యాన్ని ఈ సదస్సు హైలైట్‌ చేయనుంది.

అంతర్జాతీయ స్ధాయిలో యువ పరిశోధకులు, ప్రముఖ ప్రొఫెషనల్స్‌ పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ ప్రతిష్టాత్మక సదస్సు వేదిక కానుంది. పరిశోధన సంస్ధలు, విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో విధానాల రూపకల్పనలో ఈ సదస్సు కీలకంగా వ్యవహరిస్తుంది. భారత్‌లో సేద్యం కొత్తపుంతలు తొక్కిన క్రమాన్ని, వ్యవసాయ పురోగతిని అంతర్జాతీయ వేదికలపై చాటేందుకు ఈ సదస్సు ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.