ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ

భరతమాత స్వేచ్ఛావాయువులు పీల్చి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుగుపెట్టింది. సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారు. నాటి నుంచి భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది.

ఇక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ సమయంలో భారత ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ దనఖడ్, కేంద్రమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2047 వికసిత్ భారత్ థీమ్తో ఈసారి పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి.

పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు పతాకావిష్కరణ చేసిన కాంగ్రెసేతర పార్టీల ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి నేతగా మోడీ నిలుస్తున్నారు. ఈ వేడుకలకు దాదాపు 6 వేల మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అతిథుల్లో రైతులు, యువత, మహిళలు సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది అథ్లెట్లు, క్రీడాకారులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.